Warangalvoice

తిన్నంత అనారోగ్యం

  • ఓరుగల్లులో కల్తీ ఆహారం
  • విచ్చల విడిగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు
  • అనారోగ్యకరమైన నూనెలు, రంగుల వాడకం
  • కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  • టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేటతెల్లం

చిరుజల్లులు కురుస్తున్నాయని వేడి వేడిగా బయట ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. సాధారణ హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితి అనుకుంటే పొరపడినట్లే. ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తిండి దగ్గర నుంచి వడ్డించే గిన్నెల వరకూ అన్నీ అపరిశుభ్రమేనని ఇటీవల టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. దనార్జనే లక్ష్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తక్కువ ధరకు లభించే నాసిరకం వంట నూనెలు, రంగులు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన స్పైసెస్ వాడుతున్నట్లున్నట్లు తేల్చి చెప్పారు. ఇవి కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరంగల్ మహానగరంలో ఆహార కల్తీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా జీడబ్ల్యూఎంసీ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చేపడుతున్న సోదాలతో బడా హోటళ్లలోని డొల్లతనం వెలుగులోకొస్తోంది. దీంతో బయటి ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
-వరంగల్ వాయిస్, హనుమకొండ ప్రతినిధి

చికెన్‌-65, గోంగూర మటన్, రొయ్యల ఫ్రై, చేపల పులుసు… ఆహా, హోటళ్ల మెనూ చూస్తే నోరూరిపోతుంది! వేడి వేడిగా వడ్డిస్తుంటే లొట్టలేయాలనిపిస్తుంది. రంగురంగుల వంటకాలను చూస్తే మాంసం ప్రియుల మనస్సు లాగేయాల్సిందే. కానీ ఆ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం హాంఫటే! కేవలం రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్స్‌లోనే కాదు, పెద్ద పెద్ద అద్దాల భవంతుల్లో నిర్వహిస్తున్న స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్లలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. వినియోగదారుల ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. వరంగల్‌లో ఇప్పుడు నాణ్యత లేని ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది. రుచికి ప్రాధాన్యం ఇస్తూ, అనారోగ్యకరమైన నూనెలు, రంగులు, అపరిశుభ్రమైన పద్ధతుల్లో వంటకాలు తయారు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే హోటళ్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి, నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బయటి తిండి.. ఆరోగ్యానికి చేటు!
నగర జీవితం వేగంగా మారిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ జీవనం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో, ఇంటి వంట కంటే బయటి ఆహారంపైనే కొన్ని కుటుంబాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం, వరంగల్ నగర ప్రజలు, పర్యాటకులు, అలాగే వివిధ పనుల నిమిత్తం వరంగల్ వచ్చే దాదాపు 50 శాతం మంది నిత్యం ఏదో ఒక సమయంలో హోటల్ భోజనంపైనే ఆధారపడుతున్నారు. రోడ్డు పక్కన ఉండే బజ్జీల బండి నుంచి స్టార్ హోటళ్ల వరకు, తమ ఆర్థిక స్థోమతను బట్టి నచ్చినవి ఆరగించేస్తున్నారు. పక్కా వెజ్ వంటకాలతో పాటు వివిధ రకాల నాన్‌వెజ్ ఆహారాలను ‘ఆహా ఏమి రుచి తినరా మైమరిచి’ అంటూ హోటళ్లలో తినే వారు ఎందరో ఉన్నారు. బయటి ఆహారం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా… జిహ్వాచాపల్యం (రుచిపై కోరిక) ఆ ప్రమాదాన్ని గుర్తించకుండా చేస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వాస్తవాలు తెలిస్తే వాంతులే…
వరంగల్ నగరంలోని పలు హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లేని మాంసంతో బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాలను తయారు చేసి వడ్డిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో, తినడానికి పనికిరాని మాంసాన్ని ఉపయోగించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో, రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు అత్యంత హానికరంగా మారుతున్నాయి. వారం, పది రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని సైతం బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బిర్యానీ తయారీకి వినియోగించే మాంసం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. సాధారణ హోటళ్లే కాదు… పేరు ప్రఖ్యాతులున్న పెద్ద సంస్థలు విక్రయించే ఆహారంలోనూ సాల్మోనెల్లా, ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.


షాకింగ్ నిజాలు..
హనుమకొండలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులకు కక్కుర్తి పడుతున్న హోటల్, రెస్టారెంట్ల యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే చీకటి కోణాలు బహిర్గతమయ్యాయి. కేవలం లాభాపేక్షతో కొందరు హోటళ్ల యజమానులు పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. అంతేకాదు, కుళ్లిన మాంసానికి రంగులు అద్ది, వేడివేడిగా వడ్డిస్తున్నారు. వారాల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని కూడా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పాచిపోయిన, పురుగుల పట్టిన ఆహారాన్నే.. మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారనే విషయం, చెత్తాచెదారం, బొద్దింకలు, ఈగలు, బల్లులతో కూడిన కిచెన్‌లు దర్శనమిచ్చాయి. ఈ అమానుష చర్యలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
————-
Doctor bairi vinodజాగ్రత్తలు అవసరం
– డాక్టర్ బైరి వినోద్ రెడ్డి, ఎండీ జనరల్ పిజీషియన్

మనం నిత్యం తీసుకునే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా, తెలియకుండానే కొన్ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి లభించే ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నప్పటికీ, వాటి తయారీ, నిల్వ పద్ధతుల మూలంగా తిన్నోళ్లకు తిన్నంగా అనారోగ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, అల్సర్లు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. హోటళ్లలో వంటలకు ఉపయోగించే నూనెను పదేపదే వేడి చేయడం అత్యంత ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల నూనెలోని రసాయన సమ్మేళనాలు మారిపోయి, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. రుచి కోసం, ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే రంగులు, అధిక మసాలాలు అల్సర్లు, కేన్సర్‌లకు కారణం అవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి పార్సిల్స్ తీసుకువెళ్లేటప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను విరివిగా ఉపయోగిస్తుంటారు. వేడి ఆహారం ప్లాస్టిక్‌తో కలవడం వల్ల హానికర రసాయనాలు ఆహారంలోకి చేరి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. దీనికి బదులుగా టిఫిన్ బాక్స్‌లు లేదా స్టీలు కంటైనర్లను వాడటం శ్రేయస్కరం.
————-
Doctor Nalamasa Sreekanthఆరోగ్యంతో చెలగాటం..
– డాక్టర్ నలమాస శ్రీకాంత్, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ నేషనల్ ఫౌండర్/చైర్మన్

ధనార్జనే ధ్యేయంగా వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు ఇతర ఆహార సంబంధిత వ్యాపారులను ఉపేక్షించకూడదు. రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనేది వాస్తవం. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు, తూనికలు కొలతలు, టాస్క్ ఫోర్స్ అధికారులు సమన్వయంతో కార్యచరణ చేపట్టడం ద్వారానే ఇలాంటి వాటిని కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వరంగల్ వంటి మహానగరంలో రోజురోజుకు విచ్చలవిడిగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో వారు ఇష్టారీతిన వ్యవహరిస్తూ వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తమ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ వరంగల్ ప్రతినిధుల ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా ఒక కార్యాచరణతో తమ వంటి సంస్థలను భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల పట్ల ఉదాసీనత వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉమ్మడి కార్యాచరణను కూడా చేపడతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *