Warangalvoice

చినుకు రాలదు.. చింత తీరదు

  • ముఖం చాటేసిన వరుణుడు
  • జూలై ప్రారంభమై రెండు వారాలైనా వర్షాలు కరువే
  • చుక్క నీరు లేక వెలవెలబోతున్న వాగులు, చెరువులు
  • వర్షాభావంతో ప్రారంభం కాని వరి నాట్లు
  • పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు

వానాకాలం సీజన్ ప్రారంభమై అప్పుడే 45 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా జూలై నెలలోనే భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు నిండు కుండల్లా కనిపించేవి. కానీ ఈ సంవత్సరం జూలై రెండో వారం ముగిసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయానికి పనికివచ్చే వర్షం నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు వేసవిని తలపించేలా ఎండలు, నెర్రెలుబారిన పంట పొలాలు వ్యవసాయ రంగంపై నీలి నీడలను కమ్మేస్తున్నాయి. ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా నాటిన దాఖలాలే లేవు. దీంతో ఈ సారి కాలం పోయిందన్న వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడు పంటలు పండక పోతే రైతుల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
– వరంగల్ వాయిస్, మల్హర్

 జూన్‌లో వర్షాలు తక్కువగా ఉండే లద్దాఖ్‌ ప్రాంతంలో ఈసారి సాధారణం కంటే 385 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మొన్నటిదాకా తీవ్రమైన కరువుతో నీటి ఎద్దడిని ఎదుర్కొన్న దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతోంది. సాధారణంగా భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు, చెరువులు నీటితో కళకళలాడే తెలంగాణ ప్రాంతంలో ఈ ఏడాది భారీ లోటు కనిపిస్తోంది. భూగోళం వేడెక్కడం, తద్వారా వస్తున్న వాతావరణ మార్పుల వల్లే ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.

బిందెలతో నీళ్లు..
జూన్ నెల చివరిలో కురిసిన చిరు జల్లులకు రైతులు పత్తి విత్తనాలు నాటడంతో పాటు వరి నార్లు పోశారు. జూలై నెల మూడో వారం నుంచి వరి నాట్లు వేయాల్సి ఉండగా వర్షాలు లేక వాగులు, వంకలు ఎడారిని తలపిస్తున్నాయి. బోర్ల లోకి కూడా ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. దీంతో కాటారం డివిజన్ వ్యాప్తంగా ఏ ఒక్క గ్రామంలో కూడా వరి నాట్లు ప్రారంభం కాలేదు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్ర స్థాయిలో నష్ట పోవాల్సి వస్తుంది.

కూరగాయల సాగుకు ఎండ తీవ్రత..
మండలంలోని కుంభంపల్లి, కొండంపేట గ్రామాల రైతులు ఎక్కవ స్థాయిలో కూరగాయల సాగు చేస్తారు. గత వారం రోజులుగా ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటంతో రైతులు సాగు చేసిన చిక్కుడు, అలిశంత, బెండ, కాకరకాయ మొక్కలు ఎండిపోతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు వాటిని కాపాడుకోవడానికి రోజు ఉదయం, సాయంత్రం బిందెలతో నీరు పోస్తుండటం తీవ్ర వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతుంది.

వరి నాట్లూ వేయలే..
రానున్న వారం రోజులలో అతి భారీ వర్షాలు నమోదయ్యి వాగులు, చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరితే తప్ప వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బోర్లు కూడా సరిగా పోయకపోవడంతో బోర్ల కింద వరి సాగు చేసే రైతులు కూడా వరి నాట్లు వేయక వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే పరిస్థితి జూలై చివరి వరకు కొనసాగితే ఖరీఫ్ సీజన్ రైతులకు కన్నీటిని మిగిల్చేలా ఉంది. ఆగస్టు వరకు భారీ వర్షాల సూచన లేదని వాతావరణ శాఖ అధికారుల ప్రకటన రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

agricultural

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *