Warangalvoice

చక్రబంధం..


గంటల తరబడి ట్రాఫిక్ జామ్.
వరంగల్ వాయిస్ ములుగు: తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సర్కారు హంగు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. కోట్లాది రూపాయల ఖర్చు, హైటెక్ హంగులు, ఏఐ (ఏఐ) నిఘా అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ నియంత్రణలో ఘోరంగా విఫలమై చేతులెత్తేసింది. గంటల కొద్దీ ‘చక్రబంధం’.. నరకప్రాయం ప్రయాణం.
మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీ నరకాన్ని తలపిస్తున్నాయి. పస్రా నుంచి మేడారం చేరుకోవడానికి భక్తులకు ఏకంగా 10 గంటల సమయం పడుతుండటం, అధికారుల వైఫల్యానికి పరాకాష్ట.  పస్రా – తాడ్వాయి మధ్య ఈ స్వల్ప దూరానికే 4 గంటల సమయం పడుతోంది. తాడ్వాయి – మేడారం మధ్య మరో 4 గంటల పాటు వాహనాలు అంగుళం కూడా కదలని పరిస్థితి. మేడారం నుంచి హనుమకొండ చేరుకోవడానికి 11 గంటల సమయం పట్టింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మేడారం నుంచి బయలుదేరిన భక్తులు, శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు హనుమకొండలో దిగారు. చిన్నారులు, వృద్ధులు ఆకలి దప్పులతో వాహనాల్లోనే అలమటిస్తుంటే, పోలీస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *