Warangalvoice

ఘనంగా నాగుల పంచమి

  • ఉర్సు నాగమయ్య గుడికి పోటెత్తిన భక్తులు
  • జిల్లా వ్యాప్తంగా వేడుకలు
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నాగుల పంచమి సందర్భంగా ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి క్యూ కట్టారు. జంట నాగులకు పాలుపోసి భక్తి పారవశ్యలో మునిగితేలారు. కోరిన కోర్కెలు నెరవేర్చుతూ భక్తుల కొంగు భంగారంగా వెలుగొందుతున్న నాగమయ్య దర్శనానికి రెండు, మూడు గంటలపాటు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. భక్తుల రాకను ముందుగానే గుర్తించిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలరు. మిల్స్ కాలనీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో..
నాగుల పంచమి సందర్భంగా నర్సంపేట్ రోడ్ లోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలోని నాగేంద్ర స్వామికి పాలు పోసి మొక్కులు సమర్పించుకున్నారు. కనకదుర్గ దేవాలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సింగిరికొండ వెంకటేశ్వర్లు, సర్వరియా సురేష్ కుమార్, పప్పు, వేణు, కొప్పుల శేఖర్, కొంక వెంకటేశ్వరరావు, జంగం ప్రభాకర్, గూడ శారద, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలమ్మ ఆలయంలో..
నాగుల పంచమి సందర్భంగా మంగళవారం 36 వ డివిజన్ పుప్పాల గుట్టలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసేందుకు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *