Warangalvoice

ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ


వరంగల్ వాయిస్, హనుమకొండ: బ్యాండ్ కళాకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని ఏకశిల పార్కులో వరంగల్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రేటర్ అధ్యక్ష కార్యదర్శులు సూత్రపు అంజయ్య, కుక్కమూడి శంకర్ లతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు మాట్లాడుతూ బ్యాండ్ కళాకారుల దయనీయ స్థితిని వివరించారు. వృత్తిరీత్యా 50 ఏళ్లకే అనారోగ్యానికి గురవుతున్న కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలలో బ్యాండ్ కళాకారులకు తగిన ప్రాధాన్యత మరియు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సదస్సుకు పిలుపు..
వచ్చే ఫిబ్రవరి నెలలో బ్యాండ్ కళాకారుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి సదస్సుకు జిల్లాలోని కళాకారులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మడిపెద్ది వెంకన్న, వరంగల్ రూరల్ జిల్లా సెక్రటరీ పోడేటి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెండి బాబు, ఎండి అక్బర్, వేల్పుల శ్రీనివాస్, శ్రీధర్, రాజు, కిషన్, నవీన్, రవి, శంకర్, రియాజ్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *