
- పోలీసులకు సూచించిన నాంపల్లి కోర్టు
- ఈ నెల 21 వరకు టైం..
- మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం కేసులో సంచలన తీర్పు
వరంగల్ వాయిస్, వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై ఈ నెల 21 లోగా నోటీసు జారీ చేయాలని కోర్టు సూచించింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారణమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. ఇక కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు, సురేఖపై కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది.