Warangalvoice

ఎస్సారెస్పీ.. కాలువ కబ్జా

  • ప్లాట్లుగా చేసి విక్రయాలు
  • రెచ్చిపోతున్న రియల్టర్లు
  • అటకెక్కిన గ్రీవెన్స్ ఫిర్యాదులు
  • క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించినా చర్యలు శూన్యం
  • నిద్ర మత్తు వీడని ఇరిగేషన్ అధికారులు

ఆందోళనలో రైతులు

పర్వతగిరిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రజా ప్రతినిధుల అండ మెండుగా ఉన్న వారి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం పరిపాటి. ఇక్కడ మాత్రం ఏకంగా ఎస్సారెస్పీ కాలువనే మట్టితో నింపి ప్లాట్లు చేసి విక్రయిచడం సంచలనంగా మారింది. మండలంలోని పర్వతగిరి-చౌటపల్లి గ్రామ రెవెన్యూ శివారు నుంచి గొరుగుట తండా, జగ్గు తండా మీదుగా పర్వతగిరి రిజర్వాయర్ సమీపం మీదుగా కల్లెడ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఎస్సారెస్పీ కాలువను కల్లెడలోని వడ్లకొండ మల్లయ్యకు చెందిన బావి నుంచి ఊర చెరువు వరకు మట్టితో నింపి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. కాలువ పూడ్చి వేయడంతో తమ పంట చేలకు నీరు వచ్చే పరిస్థితి లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ స్థానిక రైతులు పలుమార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఎస్సారెస్పీ కాలువ మా పరిధిలో లేదంటూ రెవెన్యూ అధికారులు ప్రకటిస్తుండగా, ఇరిగేషన్ అధికారులు నిద్ర మత్తు వీడడం లేదని రైతులు మండి పడుతున్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించినా చర్యలు శూన్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరే ఎస్సారెస్పీ కాలువ కబ్జాను అడ్డుకోకుంటే రైతులకు దిక్కెవరంటున్నారు. జిల్లా అధికారులు కబ్జాను అడ్డుకోకుంటే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.
 
వరంగల్ వాయిస్, పర్వతగిరి : మండలంలోని పర్వతగిరి-చౌటపల్లి గ్రామ రెవెన్యూ శివారు నుంచి గొరుగుట తండా, జగ్గు తండా మీదుగా పర్వతగిరి రిజర్వాయర్ సమీపం మీదుగా కల్లెడ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఎస్సారెస్పీ కాలువను కల్లెడలోని వడ్లకొండ మల్లయ్యకు చెందిన బావి నుంచి ఊర చెరువు వరకు మట్టితో నింపి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువను మట్టితో నింపుతున్నా చేష్టలుడిగిన ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు కబ్జాకోరులకు వంతపాడుతూ అక్రమాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కాలువను పూడ్చి..
చెరువు వరకు ఉన్న ఎస్సారెస్పీ కాలువను పూర్తిగా మూసివేసి పక్కనుంచి పైప్ లైన్ వేయడం ద్వారా నీటి సరఫరాలో ఉదృతి తగ్గుతుందని దీంతో పంటలకు సరిపడ నీటి సరఫరా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువను పూడ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా రెండున్నర ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. భూముల విలువలకు రెక్కలు రావడంతో కొంతమంది అక్రమార్కులు అడ్డదారులు తొక్కులు కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఫిర్యాదు చేసినా..
ఎస్సారెస్పీ కాలువ కబ్జా జరుగుతున్నట్లు పలు మార్గలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఎన్నోసార్లు మండల అధికారులకు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కబ్జాపై స్పందించిన కలెక్టర్ స్వమంగా ఎస్సారెస్పీ కాలువను పరిశీలించారు. అయినప్పటికీ రాజకీయ పలుకుబడి కలిగిన కబ్జాకోరులపై ఎలాంటి చర్య తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కాలువను పునరుద్దించాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని రిజర్వాయర్ తూము కాలువ నుంచి ఇరువైపుల బాట వేయాలని రైతులు కోరగా స్పందించిన అధికారులు పంట కాలువకు ఇరువైపులా ఆరు ఫీట్ల భూమిని కేటాయించి దారిని తీశారని గుర్తు చేస్తున్నారు. రహదారిని కేటాయింపుకు చర్యలు చేపట్టిన అధికారులు ఎస్సారెస్పీ కాలువ కబ్జా అవుతుందని పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై జిల్లా అధికారులు నిద్ర మత్తును వీడి కాలువను పునరుద్దరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నివేదిక సమర్పించాం…: ఎమ్మార్వో వెంకటస్వామి
కల్లెడ ఎస్సారెస్పీ కాలువ కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు అందాయి. గ్రీన్వెల్స్ లో కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేయడం జరిగింది. ఎస్సారెస్పీ కాలువ భూసేకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూముల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఎవరి పేరు మీద బదిలీ కాలేదు. జిల్లా ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితిపై రిపోర్టు అందించాం. అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు కాల్వ కబ్జా విషయమై ఎస్సారెస్పీ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు తదుపరి చర్యలు నిమిత్తం రిపోర్టు పంపించాం. కాలువ కబ్జా, మరమ్మత్తులు అన్నీ ఎస్సారెస్పీ అధికారులదే బాధ్యత ఉంటుంది. రెవెన్యూ అధికారులకు దీనిపై చర్యలు తీసుకునే అధికారం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *