
నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు పూర్తి
విజేతలకు బహుమతుల ప్రధానం
వరంగల్ వాయిస్, దామెర: గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీలు పరకాల నియోజకవర్గ స్థాయిలో శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. దామెర మండల కేంద్రంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్ వేదికగా ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూర్, గీసుకొండ, సంగం మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ, మండల స్థాయిలో ప్రతిభ చాటి ఎంపికైన సుమారు 600 మంది అబ్బాయిలు, అమ్మాయిలు నియోజకవర్గ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడాంశాలలో పోటీలు జరిగాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి పరకాల ఆర్డీవో నారాయణ, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా క్రమశిక్షణకు తోడ్పడతాయని, నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వారు జిల్లా స్థాయిలో రాణించి పరకాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఆత్మకూర్ ఎమ్మార్వో, దామెర మండల విద్యాశాఖ అధికారి రాజేష్ నాయక్, ఆరు మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, డిస్నీల్యాండ్ పాఠశాల కరస్పాండెంట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.