Warangalvoice

ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం

  • లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి
  • ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు

వరంగల్ వాయిస్, పర్వతగిరి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కమీషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక లబ్ధిదారుడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు దాడి చేసిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన కన్నే కల్పన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, మొదటి విడతలో లక్ష రూపాయలు ఆమె అకౌంట్‌లో జమ అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, నాయకుడు రమేష్.. కల్పన భర్త దేవేందర్‌ను సంప్రదించారు. గ్రామంలో చెరువు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే ఖర్చుల నిమిత్తం మొదటి విడత నుంచి రూ. 10 వేలు, మొత్తం నాలుగు విడతలకు కలిపి రూ.40 వేలు కమీషన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై దేవేందర్ ‘ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు మీకు ఎందుకు కమిషన్ ఇవ్వాలి?’ అని ప్రశ్నించడంతో వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు, రమేష్ ఇద్దరు కలిసి దేవేందర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చారు. గాయాలపాలైన దేవేందర్‌ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ముక్కుకు సర్జరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపినట్లు బాధితుడు విలేకరులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దేవేందర్ వెల్లడించారు. ఈ దాడితో వడ్లకొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *