
- సోదాలు చేసిన ఏసీబీ
- పాల్గొన్న వివిధ శాఖల అధికారులు
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కార్పొరేట్ విద్యారంగానికి దీటుగా ప్రతి నిరుపేద విద్యార్ధినికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, విజిలెన్స్, ఐటీడీఏ,స్టేట్ ఆడిట్ అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలో అధికారులు కలియతిరుగుతూ విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. నాణ్యమైన భోజన సౌకర్యాలు, నిల్వ సరుకులు, వసతితోపాటు మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. పలు ఆరోపణల నేపథ్యంలో ఈ పాఠశాలలో తనిఖీలు చేపట్టామన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, మరుగు దొడ్లు అపరిశుభ్రంగా మారాయని, కనీసం బాత్రూంలకు తలుపులు కూడా లేవన్నారు. మెను పాటించడం లేదని, పాఠశాల నిర్వహణ, సరుకుల నిల్వ, స్టాక్ రిజిస్టర్ మెయింటనెన్స్ సరిగా లేదని, నాణ్యమైన భోజన ప్రమాణాలు పాటించడం లేదన్నారు. తనిఖీల అనంతరం ఉన్నత స్థాయి అధికారులకు నివెదిక అందజేయనున్నారు. ఏసీబీ డీఎస్సీ సాంబయ్య వెల్లడించారు.