- భక్తిశ్రద్ధలతో వ్రతాలు
- మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు.
శాయంపేటలో..
శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, రాజమణి దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మల్హర్..
మండలంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిండు నూరేళ్లు సౌభాగ్యం తో ఉండేలా దీవించాలని అమ్మ వారిని వేడుకున్నట్టు మహిళలు తెలిపారు.
మెట్టుగుట్టపై..
చారిత్రక మెట్టుగుట్టపై దక్షిణ కాశీ, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రాలలో శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమాలు కార్యనిర్వహణాధికారి కే. శేషు భారతి, వెంకటయ్య ఆధ్వర్యంలో జరగగా అర్చకులు విష్ణు వర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాష్ శర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.