7వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు
వాషింగ్టన్,జనవరి30(వరంగల్ వాయిస్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ రోజు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియడం లేదు. ఒక్కో నిర్ణయంతో బాధితులు వణుకుతున్నారు. తాజాగా విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిపై ఇప్పుడా దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసినా.. 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు చాలాకాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం.వాఘన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్ ఎక్స్‌ఛేంజి విజిటర్లలో 20శాతానికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని పేర్కొన్నారు. ఎఫ్, ఎం కేటగిరీల్లో వీసాలు పొందినవారే అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.