- తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు చోటు లభించే ఛాన్స్ ఉన్నది. ఎస్సీల్లో చెన్నూ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మైనారిటీల్లో అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌ను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.
తెలంగాణలో 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్‌లో సీఎంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు గవర్నర్ ప్రమాణం చేయించారు. అప్పటి నుంచి మళ్లీ మంత్రివర్గ విస్తరణ జరుగలేదు. దాదాపు 16 నెలలుగా మంత్రి వర్గంలో ఖాళీలు ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో ఢిల్లీలో సోమవారం కీలక సమావేశం నిర్వహించగా.. రాష్ట్ర నేతలు హాజరైన విషయం తెలిసిందే.
