
- ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎనిమిది మంది సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇక నూతన డీజీపీ (Telangana DGP) ఎంపికపై దృష్టి సారిచింది. బుధవారంతో సీఎస్ శాంతి కుమారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎనిమిది మంది సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది. ఆ జాబితాలో నుంచి ముగ్గురి పేర్లను సర్కార్‌కు సూచించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులైన రవి గుప్తా (1990 బ్యాచ్), సీవీ ఆనంద్ (1991 బ్యాచ్), డా. జితేందర్ (1992 బ్యాచ్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్), బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్), డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్), శిఖా గోయల్ (1994 బ్యాచ్) పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది. ఇందులో అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది.
కాగా, ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. ఇక హైదరాబాద్ సీపీగా చేసిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న రిటైర్ కానున్నారు. అదేవిధంగా సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బీ. శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్‌కు 2029 మార్చి వరకు సర్వీస్ ఉన్నది. అయితే ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రాల్లో ఒకరికి డీజీపీ పదవి దక్కడం ఖాయమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అన్ని సమీకరణాలు కుదిరితే రాష్ట్రంలో తొలి మహిళా డీజీపీగా సౌమ్యామిశ్రాకు అవకాశం లభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నాయి. అయితే, రాజకీయ, సంస్థాగత సమీకరణాల ప్రకారం చూస్తే సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డిల్లో ఒకరికి డీజీపీ పదవి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
