- అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమనం
- దేశంలోనే అద్భత విజయం.. 24 గంటల విద్యుత్
- అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణ
- 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు
- మిషన్ భగీరథతలో వందశాతం గ్రామాలకు తాగునీటి సౌకర్యం
- గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. వాడవాడనా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సకల జనులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి నినాదాలతో ఊరూవాడ మార్మోగిపోయాయి.
-వరంగల్ వాయిస్ కల్చరల్
వరంగల్ వాయిస్, హైదరాబాద్: దేశ నిర్మాణంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ రూపొందిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సోమవారం గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ..సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ఇవాళ అన్ని రంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తూ.. ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు తో దేశానికి అన్నం పెడుతూ అన్నపూర్ణగా అవతరించిందని చెప్పారు. జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్టాన్న్రిసాధించుకున్నామని కేసీఆర్ తెలిపారు. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతోందన్నారు. ప్రతి రంగంలోనూ దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధిస్తూ, ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్ల తెలంగాణ రాష్ట్రం అపూర్వ విజయాలు సొంతం చేసుకుంటోందన్నారు.
ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. 12.01 శాతం ఉత్పత్తి రంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని వివరించారు. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశంలోనే అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ. 62 వేల కోట్ల ఉంటే.. 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి మూడు రెట్లు పెరిగిందన్నారు. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గత ఏడేండ్లుగా రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (ఎస్.ఓ.టి.ఆర్)లో 11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, ఇదే విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఇది మన రాష్ట్రానికి గర్వకారణమని, ఆషామాషీగానో, అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదని చెప్పారు. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనమని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రజలకు, యావత్ భారతజాతికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 1 కోటి 20 లక్షల జెండాలను రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా అందజేసిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలంతో ఇవాళ మనమందరం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అన్నారు. స్వాతంత్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయం అని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను పోషించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.
