Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కుట్ర పూరితంగా కులగణన సర్వే చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌తో సహా.. గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరుగలేదని చెప్పుకొచ్చారు. 60లక్షల మంది ఎక్కడకు పోయారో రేవంత్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా…మిగితా వాళ్లు ఎక్కడకు పోయారనేది క్లారిటీ లేదని అన్నారు. కులగణనపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపితే లాభం లేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని తెలిపారు. 57శాతం బీసీ జనాభా ఉంటుందని.. ముస్లింల లెక్క తేలకుండా హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని.. కానీ తమ మీద పడి ఏడవడం ఏంటి..? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
