Warangalvoice

Mla Sunitha Lakshma Reddy Objection Speaker Prasad Kumar Comments On Her

Sunitha Lakshma Reddy | స్పీకర్‌ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

  • స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడానుతప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు. అయినా తనను అలా వినబుద్ధికావడం లేదని ఎలా అంటారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్‌ ఉపసంహరించుకోవాలన్నారు. శాసనసభలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంటుంది. నిన్న మీరు అన్నటువంటి మాటలు చాలా బాధాకరం. తాను మాట్లాడుతున్న సందర్భంలో సబ్జెక్టునుంచి ఎక్కడా డీవియేట్‌ కాలేదు. మహిళలు, శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సమస్యలపై మాట్లాడుతానని ముందే సమాచారం ఇచ్చాను. అవకాశం కోసం సాయంత్రం వరకు నిరీక్షించా. రాత్రి 8 గంటలకు మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించారు. రెండు నిమిషాల్లో పూర్తిచేయాలన్నారు.

తాను మాట్లాడుతుండగా.. నాకే వినబుద్ధి అవడలేదని, మీరంతా ఎలా వింటున్నారో అని మీరు అనడం నాకు చాలా బాధకలిగించింది. ఒక మహిళగా, సీనియర్‌ సభ్యురాలినైనా తాను ఎక్కడా అన్‌పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అంతా మాట్లాడినప్పటికీ.. జీరో అవర్‌లో ఒకటే సబ్జెక్ట్‌ మాట్లాడాలని, అసభ్య పదజాలం మనం ఉపయోగించకూడదని కొత్తగా వచ్చిన మా సభ్యులకు చెబుతాను. ఒకరికి చెప్పగలిగిన స్థాయిలో ఉన్న తనను మీరు మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయి. సబ్జెక్టును మించి ఒక విషయం కూడా బయటకు జరుగలేదు. అలాంటి సమయంలో మీరు మాట్లాడిన మాటలు నాకు బాధ కలించాయి. సభలో నిరసనల మధ్య తనకు సరిగా వినపడలేదని, వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిన తర్వాత మా సభ్యులు చెప్పారు. నేను ఎప్పుడూ కూడా ఒకరితో మాటపడలేదు, ఎక్కడున్నా క్రమశిక్షణతో ఉన్నాను. తాను తప్పేంమాట్లాడానో చెప్పండి. నా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడానే తప్ప మరో విషయం కాదు. మీ వ్యాఖ్యలు మంచిగనిపిస్తే రికార్డుల్లో కొనసాగించండి. లేదంటే ఉపసంహరించుకోవాలి. సభాపతిగా మా హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌ది. అధికార పక్షానికి నచ్చకపోతే బాగాలేదని చెప్పాలి. గతంలో కూడా మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి అభ్యంతరకరంగా మాట్లాడారని, అయినప్పటికీ నిలుచుని మానంగా నిరసన తెలిపాం. ఇలాంటివి మరోసారి జరగకూడదని, సభా సంప్రదాయాలకు మంచిదికాదు’ అని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు లక్ష్మారెడ్డి సూచించారు.

కాగా, స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహిళలంటే తనకు ఎనేలని గౌరవం ఉందన్నారు. తనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, మహిళలను గౌరవిస్తానని చెప్పారు. ‘మిమ్మల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. తాను ఈ సీటు మీద ఉండి తమను అన్నానని అనుకోవడం చాలా పొరపాటు. మీరు మాట్లాడేటప్పుడు ఇరువైపుల నుంచీ రన్నింగ్‌ కామెంట్‌ వస్తున్నది. దీంతో వారు మాట్లాడేది నాకే వినబుద్ధి అవుతలేదు. మీకు వినబడుతున్నదా అని అన్నాను. మిమ్మల్ని ఉద్దేశించి అలా అనలేదు. మీ మనసు కష్టపడితే ఆ వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్నాను.’ అని చెప్పారు.

Mla Sunitha Lakshma Reddy Objection Speaker Prasad Kumar Comments On Her
Mla Sunitha Lakshma Reddy Objection Speaker Prasad Kumar Comments On Her

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *