- SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్‌లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
వరంగల్ వాయిస్, దోమలపెంట : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై (SLBC Tunnel Tragedy) కీలక అప్డేట్ వచ్చేసింది. సొరంగం ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary to the Govet Shanti Kumari) చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. టన్నెల్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు.
రేపు (ఆదివారం) రాత్రి వరకు నలుగురి ఆచూకీ దొరుకుతుందన్నారు. మిగిలిన వారి ఆచూకీకి మరింత సమయం పడుతుందని తెలిపారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రతిపక్షాలు ఘటనపై ఇష్టానుసారంగ మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యంత విచారకరం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోవడం అత్యంత విచారకరమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. రాడార్ ద్వారా నలుగురి మృతదేహాలు ఒకచోట.. మరో ఇద్దరివి మరోచోట.. మరో ఇద్దరివి మరోచోట గుర్తించారని తెలిపారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని.. రేపు మధ్యాహ్నానికల్లా మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ పేర్కొన్నారు.
