- SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది
వరంగల్ వాయిస్, మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇదే తరహాలో 2023లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో 34 మందిని రక్షించిన మద్రాస్ ఐఐటీ నిపుణులను రంగంలోకి దించింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆక్వా ఐ, ఫ్లెక్సీ ప్రొబ్ పరికరాలతో మద్రాస్ ఐఐటీ నిపుణులు సహాయక చర్యలు కొనసాగించనున్నారు. మరోవైపు వైజాగ్‌కు చెందిన నేవీ బృందం కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు మూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే పెద్ద ఎత్తున ఊటనీరు ఉబికి వస్తుండటంతో నీరు బురదతో కలిసి పెద్ద ఎత్తున బయటకొస్తుంది. దీంతో ఆదివారం నాడు 13 కిలోమీటర్ల లోపలికి చేరుకున్న రెస్క్యూ బృందం.. సోమవారం నాడు 11 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగింది. అక్కడి నుంచి బురద నీరు పెద్ద మొత్తంలో వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టడానికి వీలు కావడం లేదు. 24 గంటల్లోనే నీటి ధారలు ఎక్కువ కావడాన్ని గుర్తించారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫలితంగా లోపలికి రెస్క్యూ బృందం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ అధిగమించేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులు తీసుకువచ్చిన కొత్త పరికరాలపైనే ఆశలు నెలకొన్నాయి. వీరితో పాటు ఆర్మీ ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌తో పాటు మిగతా బృందాలు నిర్విరామంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ కమిషనర్ అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ నిపుణులతో చర్చించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల చిక్కుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు.
ఆక్వా ఐ.. ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాల మీదే ఆశలు..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యాధునిక పరికరాలను వాడుతున్నారు. మద్రాస్ ఐఐటీకి చెందిన సాంకేతిక నిపుణుల సహకారంతో లోపల చిక్కుకున్న వారిని గుర్తించి రెస్క్యూ చేయనున్నారు. ఐఐటీ నిపుణులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆక్వా ఐ కెమెరా హై రిజల్యూషన్ ది. ఇది నీటిలో సుమారు 50 మీటర్ల చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తిస్తుంది. బురద ఇతర ఏమున్నప్పటికీ కూడా గుర్తించి రికార్డింగ్ చేస్తుంది. ఈ కెమెరా వల్ల లోపల చిక్కుకున్న వారి పరిస్థితిని గమనించనున్నారు. గతంలో చాలా చోట్ల ఇలాంటి టెక్నాలజీనే వాడారు. ప్రస్తుతం ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ఇదే టీం దాదాపు 34 మందిని రక్షించింది. ఇదే టెక్నాలజీ ద్వారా సహాయక చర్యలు వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ కెమెరా లోపలికి పంపించి ఆ చిత్రాల ఆధారంగా ఏం చేయాలని దానిపై నిపుణులు ఇచ్చిన సూచనలను పాటించి రెస్క్యూ చేసే అవకాశం ఉంది. మరోవైపు హై రిజల్యూషన్ కలిగిన కెమెరాలను కూడా పంపిస్తున్నారు. ఈ కెమెరాలు లోపల ఉన్న ప్రతి అంగుళాన్ని కూడా చిత్రీకరించి బయట ఉన్న వారికి లైవ్ గా అందిస్తోంది. మరోవైపు ఎనిమిది మందిని చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక జాగిలాలను కూడా రంగంలో దించారు.
