- Seethakka criticizes BRS and BJP: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎంపీలు డుమ్మాకొట్టారు. దీనిపై సీతక్క స్పందించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని మరోసారి రుజువైందన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారు కేంద్రంపై పోరాటం అంటే సమయానికి ఎగ్గొడతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రాలేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదే పదే కోరే బీఆర్ఎస్ ఈరోజు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్రంపైఏ విధంగా పోరాటం చేయాలో ఎందుకు చెప్పలేదని మంత్రి విరుచుకుపడ్డారు.
ఏడాదిలోపే కోటీశ్వరులు అవుతారా?
అలాగే మాజీ మంత్రి హరీష్‌రావుపై కూడా సీతక్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఎకరానికి కోటి పంట ఎలా పండించారో సక్సస్ ఫార్ములా చెప్పాలన్నారు. ‘ఓడిపోయిన మీ ఇంటి మహిళను మండలికి పంపి అదే మహిళా సాధికారత అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పావుల వడ్డీ రుణాలు కూడా ఇవ్వలేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే కూడా ఓర్చుకోవడం లేదు. మహిళలను మేము బస్సులకు ఓనర్లను చేస్తున్నాం. హరీష్ రావు నీ కూతురులాగే ఆడబిడ్డలు ఎదగాలని ఆశీర్వదించండి. బీసీ ఉద్యమానికి కూడా తానే చాంపియన్ కావాలని కవిత వచ్చారు.. మేము మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతాం. ఏడాదిలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. కానీ గ్రాడ్యుయేట్స్ బీజేపీకి ఎలా ఓటు వేశారో తెలియడం లేదు. ప్రచారంలో మేము వెనుకబడ్డం వల్లనే మేము ఓడిపోయాం’ అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.
