- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు.
వరంగల్ వాయిస్, బడంపేట : ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ డబ్బులు వస్తాయనే ఆశతో అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారని అన్నారు. సకాలంలో చెక్కులు అందజేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మీ డబ్బులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మారడం లేదని ఆరోపించారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రేవంత్ సర్కార్‌కు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ప్రజాపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో ఉందన్నారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కూడా చేయలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని మండిపడ్డారు. మాటలు చెప్పుడు తప్ప చేతలు మాత్రం శూన్యమని అన్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్తల కామేశ్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, సునీత బాలరాజ్, లలిత జగన్, నిర్మలారెడ్డి, అంజయ్య, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
