- RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఈ కారణంగా అటు అన్నదాతలు, ఇటు పరిశ్రమల వారితో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరెంట్ కోతలపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో నేనుండే బండ్లగూడ ఏరియాలో రెండు గంటల్లో ఆరు (6) సార్లు కరెంటు పోయింది!! రేవంత్ గారు.. మీరు కోతలు-ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? అని ప్రశ్నించారు. మీ పాలనంతా అంధకారమే అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
ఇక కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతన్నకు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం కావడంతో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు కరెంటు కోతలతో పంటలకు నీళ్లందక పచ్చని పొలాలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో తెలంగాణ రైతాంగం ఉండిపోయింది. కడుపుమండి అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు.
