Warangalvoice

CM Revanth Reddy criticizes kcr family loans past government

Revanth criticizes KCR family: కేసీఆర్ ఫ్యామిలీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సీఎం రేవంత్

  • Revanth criticizes KCR family: 1,532 మందికి లెక్చరర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు సీఎం. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటల ప్రకారం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభివృద్ధి పథంలో నడిస్తే భవిష్యత్‌తరాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.

55 రోజుల్లోనే 11వేల టీచర్ పోస్టులు..

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగం కూడా ఒక కారణమన్నారు. తెలంగాణ సాధనలో నిరుద్యోగులది కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోవడం వల్లే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమన్నారు. కొత్తగా నియామకమైనవారు తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగాలపై కోర్టుల్లో చిక్కుముడులు విప్పుతూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌తో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు పోటీ పడట్లేదని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వం, ఉపాధ్యాయులే అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని… ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.

క్రీడల్లో రాణించాలి..

విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని.. అది వారి భవిష్యత్‌కు పెట్టుబడి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచానికే తెలంగాణ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్రీడలు మన దేశ ప్రతిష్టను పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. క్రికెటర్‌ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామన్నారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చామన్నారు. పారాలింపిక్స్‌ క్రీడాకారిణి దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం ఇచ్చామని అన్నారు.

అన్నీ అప్పులు.. తప్పులే…

కొంతమంది స్ట్రేచర్ స్ట్రేచర్ అని మాట్లాడుతున్నారని.. స్ట్రేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచర్ మీదకు వెళ్లారన్నారు. స్ట్రేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదని తెలిపారు. కేసీఆర్ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమే అని అన్నారు. ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారని.. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారని.. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారని అన్నారు. తాను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్‌లా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘అబద్ధాల ప్రాతిపదికన తాను రాష్ట్రాన్ని నడపను. వాస్తవాలు మీతో పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణలో భావితరాల భవిష్యత్ నిర్మాణానికి మీ సహకారం అవసరం. ఎంతసేపు సీఎం కుర్చీని లాక్కుంటామంటే ఎలా.. నన్ను పనిచేయనివ్వాలి కదా మీరు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy criticizes kcr family loans past government
CM Revanth Reddy criticizes kcr family loans past government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *