- Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే.
వరంగల్ వాయిస్, ధారావి : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ధారావి పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఓ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా యూట్యూబర్‌గా ఆ ప్రదేశాన్ని సందర్శించారంటూ వ్యాఖ్యానించారు.
‘రాహుల్ గాంధీ ముంబైకి కాంగ్రెస్ నాయకుడిగా రాలేదు. ఓ యూట్యూబర్‌గా వచ్చి ధారావిని సందర్శించారు. అక్కడ వీడియోలు తీసుకొని వెళ్లిపోయారు’ అంటూ వ్యాఖ్యానించారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థానిక నేతలను కలవకుండానే రాహుల్ తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. ‘ముంబై కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. అయితే, కాంగ్రెస్ నాయకుడు మాత్రం వీడియోలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ముంబై కాంగ్రెస్ పార్టీ ఓట్ల ద్వారానే కాదు.. డబ్బు ద్వారా కూడా దివాలా తీసింది. ముంబై కాంగ్రెస్ కార్యాలయం చాలా నెలలుగా అద్దె కూడా చెల్లించట్లేదు. అంతేకాదు, రూ.5లక్షల విద్యుత్ బిల్లు కూడా చెల్లించాల్సి ఉంది’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా, ముంబైలోని ధారావిలో రాహుల్ గాంధీ ఈ నెల 6న పర్యటించారు. అక్కడి తోలు పరిశ్రమ కార్మికులను కలుసుకున్నారు. స్థానిక పరిశ్రమలను సందర్శించి కార్మికులతో ముచ్చటించారు.
