Warangalvoice

BJP MP Raghunandan Rao open challenge to BRS MLC Kavitha

Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

  • Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.

వరంగల్ వాయిస్, సిద్దిపేట: బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇవాళ(శుక్రవారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని సవాల్ విసిరారు. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతకు ఇవ్వండి. శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వరని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఈటెల రాజేందర్‌ బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు బీసీల్లో పెద్ద సామాజిక వర్గానికి చెందిన ఈటెలను మధ్యలోనే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు కావాలి.. మరి బీసీలకు పదవులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రోజు ఫామ్‌హౌస్ చర్చలో కేసీఆర్‌తో తాను చెప్పిన విషయంపై కవిత మాట్లాడాలని సవాల్ విసిరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అవకాశం వస్తే బీజేపీలో ఒక మహిళకు ఇచ్చామని గుర్తుచేశారు. మొదటి ఐదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేని ఒకే ఒక కేబినెట్ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కేసీఆర్ కేబినెట్ అని విమర్శించారు. బీజేపీని విమర్శించే ముందుగా బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పారు. బీజేపీ వైపు వేలెత్తి చూపించే బదులు ముందుగా బీఆర్ఎస్ నేతలు తప్పులు సరిదిద్దుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హితవు పలికారు.

BJP MP Raghunandan Rao open challenge to BRS MLC Kavitha
BJP MP Raghunandan Rao open challenge to BRS MLC Kavitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *