- హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
వరంగల్ వాయిస్, హుస్నాబాద్ టౌన్ : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నేటి నుంచి సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో ఇవాళ సన్న బియ్యం పథకం మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగిందని.. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని 17,263 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని.. దీని ద్వారా రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతుందని చెప్పారు.
గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల నుంచి ఇంటిదాకా కూడా చేరలేదని.. పక్కదారి పట్టాయని ఇకనుంచి అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించవన్నారు. ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్ని వినియోగించుకుంటారని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్యాస్ డబ్బులు రావట్లేదు..
చింతల లలిత అనే మహిళ తనకు గ్యాస్ డబ్బులు రావడం లేదని సన్న బియ్యం పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం విధానం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయని, గ్యాస్ డబ్బులు తప్పనిసరిగా వచ్చేందుకు కృషి చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. చిన్నచిన్న ఇబ్బందులు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు ఉన్నారు.
