
- ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని, వినడానికి సీఎం, తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పవచ్చని, తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.
ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం.. ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. సమస్యలు తొలుగుతున్నాయి. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్న. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి, వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటా. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒక్కటైన ఇబ్బంది పెట్టామా. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని మంత్రి అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించామని తెలిపారు. 2017 పే స్కేల్ 21 శాతం ఇచ్చామని గుర్తుచేశారు. దీనివల్ల సంవత్సరానికి రూ.412 కోట్లు భారం పడుతుంది. పీఎఫ్ ఆర్గనైజేషన్‌లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించాం. నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ 2024 జనవరి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ.345 కోట్లు చెల్లించాం. నెలవారీ సీసీఎస్ కంట్రిబ్యూషన్ గతేడాది జనవరి నుండి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. 1500 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేశాం, తార్నాక దవాఖానను సూపర్ స్పెషాలిటీగా మార్చామని వెల్లడించారు.
మంత్రితో భేటీ అయినవారిలో ఆర్టీసీ జేఏసి చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్, కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్, ఎస్‌టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ, పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు ఉన్నారు.
