- Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు.
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. దక్షిణాసియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్ఛేంజ్ SATTE 2025 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒమర్ అబ్దుల్లా ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. టూరిజం ప్రమోషన్ ఈవెంట్ జరిగే యశోభూమికి 25 నిమిషాల్లో చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడకు చేరుకోవడానికి కారులో గంటన్నర కంటే ఎక్కువ సమయం పడుతుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మెట్రో రైలులో ప్రయాణం వల్ల సమయంతోపాటు ఇంధనం ఆదా కావడంతోపాటు కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తుందని చెప్పారు. ‘నేను మళ్ళీ యశోభూమికి కారులో వెళ్లను’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మెట్రో ట్రైన్ టిక్కెట్‌తోపాటు సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా గతంలో కూడా ఢిల్లీ మెట్రో రైలును ప్రశంసించారు. 2018లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో తొలిసారి ఆయన ప్రయాణించారు. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. టెర్మినల్ 3కి చేరుకోవడానికి ఇది ఉత్తమ మార్గం’ అని నాడు కితాబు ఇచ్చారు.
