- లక్షల్లో జీఎస్టీ ఎగవేత
- నిద్ర మత్తులో చేనేత, జౌళి శాఖ
- పర్సంటేజీల వారీగా పంపకాలు
- ఆడిట్ రిపోర్టులపై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌చే సంతకాలు
- ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
- చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికుల డిమాండ్
చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో వివిధ కాంపొనెంటుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఆర్ ఆర్ ఆర్ పథకం చేనేత, జౌళి శాఖ అధికారులకు కాసుల పంట పండించింది. కోట్ల రూపాయల విలువ చేసే చేనేత పరికరాలను కొనుగోలు చేసినట్లు ఆడిట్‌లో చూపించినా ఎక్కడ కూడా జీఎస్టీ చెల్లించినట్లు లేకపోవడం వారి అక్రమాలకు అద్దం పడుతోంది. చేనేత, జౌళి శాఖలో రూ.3కోట్ల కుంభకోణం పేరిట ‘వరంగల్ వాయిస్’ దినపత్రిక నెల రోజుల క్రితమే అధికారుల అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయినా జిల్లా అధికారులు మాత్రం కాలు కదుపకుండా కాంప్రమైజ్ జరిగిందంటూ వారిని పక్కదోవ పట్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా దీనిపై నిజ నిర్ధారణ చేయాలని పలువురు చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి
వరంగల్ వాయిస్ ప్రతినిధి: చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్‌ఆర్‌ఆర్ (రివైవల్-పునరుద్ధరణ, రిఫార్మ్-పునఃసంస్కరణ, రీస్ట్రక్చరింగ్-పునఃనిర్మాణం) ప్యాకేజీ కింద రూ.3కోట్ల గ్రాంటును మంజూరు చేసింది. ఇదే చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు కలిసి వచ్చింది. ఇందులో పైసా కూడా ఖర్చు చేయకుండానే మొత్తం కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఎవరి వాటా వారు తీసుకొని చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై ‘వరంగల్ వాయిస్’ దిన పత్రిక విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు అదేశించారు. దోషులను కనిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కంచే చేసే మేసిందన్న రీతిగా దోషులంతా ఆ శాఖకు చెందిన ఆడిట్ అధికారులే కావడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రోజులు గడుపుతూ సమస్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
ఆడిట్ రిపోర్టులపై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌చే సంతకాలు..
ఆడిట్ ధ్రువీకరణ పత్రంపై కేవలం ఆడిట్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్ట్రార్ మాత్రమే సంతకం చేయాలన్న నిబంధనను అటకెక్కించారు. తప్పుడు నివేదికలతో రూపొందించిన ఆడిట్ రిపోర్టుపై అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంతకం చేయడం వివాదాస్పందంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంతకం ఎలా చేస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగంలో లక్షల రూపాయలు చేతులు మారినందునే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆడిట్ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేశాడన్న ఆరోపణలున్నాయి.
లక్షల్లో జీఎస్టీ ఎగవేత..
అసలే కొనని వాటిని కొన్నట్లు ఆడిట్‌లో చూపించారు. కనీసం వీటికన్నా జీఎస్టీ చెల్లించారా అంటే అదీ లేదు. వివిధ కాంపోనెంటుల కింద 16 చేనేత సహకార సంఘాలకు మంజూరు అయిన రూ.3కోట్ల నుంచి కొన్ని సంఘాలు మగ్గాలు, ఇతర పరికరాల కొనుగోలు చేసినట్లు అడిట్ రిపోర్టుల్లో పొందుపరిచారు. వీటి విలువ రూ. ఒక కోటికి పైగా ఉంటుందని క్లుప్తంగా కనిపిస్తోంది. కాని ప్రభుత్వానికి ఎక్కడ కూడా జీఎస్టీ చెల్లించినట్లు పేర్కొనలేదు. కనీసం ప్రభుత్వానికి కట్టిన చలాన్ కూడా లేదు. ప్రభుత్వానికి జీఎస్టీ కింద కసీనం రూ.36 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నా ఒక్క పైసా కూడా చెల్లించకపోవడం వారి అక్రమాలకు అద్దం పడుతోందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేత..
ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజీ స్కీమ్ ద్వారా ప్రభుత్వం సంఘాలకు ఇచ్చిన డబ్బు మొత్తం గ్రాంట్ రూపేణా ఇచ్చినదే. కాని అప్పు ఇవ్వలేదు.. మరల చెల్లించుమని ఎక్కడ అడగలేదు. సంఘం ఇతరులకు ఇవ్వవలసిన బాకీలు ఆడిట్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటా ధనం వర్కింగ్ క్యాపిటల్ వగైరా కాంపోనెంట్ల కింద ఇచ్చి నిఖర నష్టం పోగా మిగిలిన డబ్బు మొత్తం నికర లాభం కింద అగుపడుతుంది. కాని ఆడిట్ అధికారులు నికర లాభం వస్తే ప్రభుత్వానికి 30శాతం ఆదాయంపన్ను (ఇన్ కమ్ ట్యాక్స్) చెల్లించవలసి ఉంటుంది. దానిని మరిచి అదనపు ఖర్చులు రాసి సంఘాన్ని మరింత నష్టాల్లో ఉన్నట్లు చూపించి ప్రభుత్వానికి కట్టాల్సిన లక్షల రూపాయల ఆదాయపన్నును ఎగవేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఐ.టి. రిటర్న్ లు దాఖలు చేసిందే లేదు. ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజి స్కీమ్ డబ్బు మొత్తం ఖర్చయినట్లు లెక్కలు చూపినా ఇంకా బాకీ ఉన్నట్లు ఆడిట్ రిపోర్టులలో అగుపడుతోంది. కాని ప్రభుత్వం ఇచ్చింది అన్ని కాంపోనెంట్లు సెటిల్‌మెంట్ చేసుకొమని ఇచ్చినవే. ప్రభుత్వ ఆదాయాన్ని ఎగవేసిన సంఘాలపై అందుకు సహకరించిన ఆడిట్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అవినీతి అధికారులపై చర్యలేవీ..
ప్రభుత్వం ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజీ కింద మంజూరు చేసిన రూ.3 కోట్లు స్వాహా చేసిన సంఘం అధ్యక్షులు, అందుకు సహకరించిన ఆడిట్ అధికారులు, చేనేత జౌళి శాఖ అధికారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చర్యలు చేపట్టాల్సిన వారే చూసీచూడనట్లు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్.ఆర్.ఆర్ పథకం కింద మంజూరైన రూ.3కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.