Warangalvoice

Ex Minister Niranjan Reddy Attack On Congress Govt In Telangana

Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు : నిరంజ‌న్ రెడ్డి

  • వ్య‌వ‌సాయ రంగం, రైతుల ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బాధ్య‌త లేదు, బాధ లేదు అని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయ రంగం, రైతుల ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బాధ్య‌త లేదు, బాధ లేదు అని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నిరంజ‌న్ రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతు బీమా.. రైతు చనిపోయిన ఏడు పని దినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతు బీమా, రైతుబంధు అని యూఎన్ఓకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది. రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా రూ.5,909.85 కోట్లు ఆ రైతు కుటుంబాలకు పరిహారంగా అందించడం జరిగింది. రైతు బీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6122.65 కోట్లు ఎల్ఐసీకి ప్రీమియంగా చెల్లించింది. ఏడాదికి రూ.1500 కోట్లకు గాను రెండో విడత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించని కారణంగా ఏడు వేల పైచిలుకు కుటుంబాల పరిహారం పెండింగ్‌లో ఉన్నాయ‌ని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

15 నెలలలో 440కి పైగా రైతులు ఆత్మహత్యలు..

15 నెలలలో 440కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు రాదు, నీళ్లు రావు, రైతుబంధు రాదు, రైతు బీమా ప్రీమియం చెల్లించరు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తున్నది? కాంగ్రెస్ అభయహస్తంలో వ్యవసాయానికి రూ.3 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. 24 గంటల కరెంటు అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీలను భర్తీ చేయలేదు. అసైన్డ్ పోడు భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం అని దాని ఊసెత్తడం లేదు. ప్రభుత్వ భూములను కుదువపెట్టి రైతు భరోసా కోసం అని రూ.10 వేల కోట్లు తెచ్చి రెండు నెలలు అవుతుంది.. మూడెకరాల వరకు రైతులకు కూడా రైతు భరోసా నిధులు పడలేదు. మూడెకరాల వరకు రైతు భరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే.. మూడెకరాల వరకు రైతులకు డబ్బులు వేయాలని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడంలేదు? ఇది రైతు అనుకూల ప్రభుత్వమా? అని నిరంజ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ప్రభుత్వం సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదు?

రైతు బీమాను ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్లు లేక, కరెంటు లేక రైతుల పొలాలు ఎండుతున్నాయి, పశువులకు మేతగా మారుతున్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. యాసంగి సీజన్ మొదలయ్యే సమయానికి సమీక్ష చేయడంలో ప్రభుత్వం విఫలమయింది. రాష్ట్ర ప్రభుత్వ అన్ని వైఫల్యాలకు కారణం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. రైతులు పంటలు వేసుకున్న తర్వాత రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డితో రైతులు పంటలు వేసుకోవద్దు అని చెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖా మంత్రి చెప్పకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో సాగునీళ్లకు కొరత లేదని చెప్పించారు. మరి నీటికి, కరెంటుకు సమస్య లేకుంటే రైతులు దేనికి ఆందోళన చెందుతున్నట్లు? ప్రభుత్వం సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదు? అని నిరంజ‌న్ రెడ్డి నిల‌దీశారు.

పంటలను ఊరికనే పశువులకు వదిలేస్తారా?

ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖా మంత్రులు ధైర్యం ఉంటే పంటలు ఎండుతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలి. రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండడం లేదని ధైర్యం ఉంటే ప్రభుత్వం ప్రకటించాలి. కష్టపడి సాగు చేసే రైతులు తమ పంటలను ఊరికనే పశువులకు వదిలేస్తారా? రోజూ అబద్దాలతో కూడిన రాజకీయాలు చేయడం తప్ప ప్రభుత్వానికేమీ పట్టడం లేదు. రాష్ట్ర జనాభాలో 50 నుండి 60 శాతం ఉండే రైతులు, రైతుకూలీలు, దాని అనుబంధ రకాల ప్రజలు జీవించే వ్యవసాయరంగం గురించి పట్టించుకోకుంటే ఈ ప్రభుత్వం దేని గురించి పట్టించుకుంటుంది? రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు, వర్షాలు ఉన్నా దానిని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది అని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి..

కరెంటు, సాగునీటి కష్టాల కారణంగా రైతు భరోసా ఇవ్వని కారణంగా రైతులు రాష్ట్రంలో ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంత్రులు రైతుల వద్దకు వెళ్లి భరోసా కల్పించాలి.. ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం కల్పించాలి. తుంగతుర్తి, సూర్యాపేటలకు 300 కిలోమీటర్ల దూరం కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ హయాంలో పంటలు పండించారు. గోదావరిలో నీళ్లున్నా ఎత్తి పోయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వ్యవసాయరంగాన్ని ఎంతో బాధ్యతతో కేసీఆర్ పాలనలో ముందుకు తీసుకెళ్లాం. రైతాంగం బాధలను దిగమింగాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వేడుకుంటున్నాం.. మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దని ముకుళిత హస్తాలతో కోరుతున్నాం.. ప్రాధేయపడుతున్నాం.. వేచి ఉండండి.. సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల బాధ్యత లేదు.. బాధ లేదు. రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు, పథకాల అమల్లో కాంగ్రెస్ విఫలం. వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని రాహుల్ సమక్షంలో ప్రకటించిన కాంగ్రెస్ దానిని అమలు చేయకుండా మోసం చేస్తుంది అని బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Ex Minister Niranjan Reddy Attack On Congress Govt In Telangana
Ex Minister Niranjan Reddy Attack On Congress Govt In Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *