Warangalvoice

Mukkoti Ekadashi

Mukkoti Ekadashi | పవిత్ర ఉత్తర ద్వార దర్శనం ’ముక్కోటికి‘

వరంగల్ వాయిస్, కల్చరల్ : ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి, తలంటు స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ద చూపుతారు. పండుగలకు.. విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలను తీరుస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు. క్షీర సముద్రాన్ని మధించేప్పుడు.. ఈ రోజునే హాలాహలం.. అమృతం పుట్టాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుడు.. హాలాహలం మింగి కంఠం దగ్గర ఉంచుకోగా.. అమృతాన్ని దేవతలు అందరూ పంచుకున్నారు. అప్పటి నుంచి పరమేశ్వరుడిని నీలకంఠేశ్వరుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు. విష్ణు పురాణం ప్రకారం.. మహా విష్ణువు ఆ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచాడని పండితులు చెబుతున్నారు. ఇద్దరు రాక్షసులు.. మహా విష్ణువును దర్శించుకొనేందుకు ఎంతో కాలంగా ఆ ద్వారాల దగ్గర వేచి ఉన్నారట. ఆ రాక్షసులు పూర్వ జన్మలో చేసిన పాపాల వలన రాక్షసులుగా జన్మించారు. ఆ రాక్షసులు తమ పాపాలను నివృత్తి చేసి.. వైకుంఠ ప్రవేశం కల్పించాలని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు పుష్యమాసం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి.. వారికి ముక్తిని ప్రసాదించాడట. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *