Warangalvoice

Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డివి అంతులేని అబ‌ద్ధాలు.. ఎమ్మెల్సీ క‌విత ఫైర్

  • MLC Kavitha | రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు.

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు.

రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు. నెలకు రూ 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతున్న సీఎం.. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదు. మరి 6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు..? అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలి.
అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్ర‌మలో సీఎం ఉన్నారు. రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ప్రతీ నెల 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారు. కానీ కాగ్ ప్రకారం 12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదు. మరి ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు..? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారు..? అని క‌విత ప్ర‌శ్నించారు.

ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం 5800 కోట్లకు పడిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్ విశాల హృదయం తెలవాలంటే ఎస్ఎల్బీసీ విషయంలో అర్థమవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానా రెడ్డిని ముందుపెట్టి కాంట్రాక్టర్‌కు 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కేసీఆర్. కరోనా తర్వాత కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేమంటే మళ్లీ 100 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 3340 కోట్లు. కానీ కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టిన ఖర్చు 3890 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి 11 కీమీ మేర టన్నెల్ తవ్విస్తే ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నార‌ని క‌విత మండిప‌డ్డారు.

సొంత జిల్లాలో సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారు. 8 మంది ప్రాణాలు చిక్కుకుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఉత్తరాఖాండ్‌లో టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లు ప్రాణాలతో బయటపడేవరకు అక్కడే ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రికి సోయి లేదు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదు. మెఘా కృష్ణా రెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లావద్దన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు మీద ఒకరు ఆర్టీఐ వేస్తే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి జవాబు ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది అని క‌విత గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా… కాంట్రాక్టర్లు ముఖ్యమా..? ప్రధానిని కలిసిన వెంటనే బీఆర్ఎస్ పని ఖతమని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. మరి వీటన్నింటికి మా కుటుంబానికి, మా పార్టీకి సంబంధం ఏంటి..? ఇది కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై సీఎం కుట్ర పన్నడమే కానీ మరొకటి కాదు. సంబంధం లేని సంఘటనల గురించి ప్రధానిని కలిసిన తర్వాత సీఎం మాట్లాడారు. దీన్ని బట్టే కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతున్నదని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు.

Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics
Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *