Warangalvoice

Brs Mlc Kavitha Sensational Comments On Congress Leaders

MLC Kavitha | బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిని వ‌దిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వరంగల్ వాయిస్,  కామారెడ్డి : ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్ర‌సంగించారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ అని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్పారు.

మాట తప్పడం… మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి అని క‌విత విమ‌ర్శించారు.

ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలి. తెలంగాణ గడ్డ మీద అగ్గిపెట్టించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. నలిగిపోయిన ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించింది బీఆర్ఎస్ పార్టీ. స్వ‌తంత్ర దేశంలో లక్ష్యాన్ని చేరిన ఒకైక పోరాటం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమం మాత్రం. వీరులు మాత్రమే లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తారు… అది కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమైంది. ప్రజాస్వామ్య పంథాను నమ్ముకొని హింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించాము. త్యాగాలతో తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు వేశారు. కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేసిన ఘనత కేసీఆర్‌ది. ఎవరో భిక్షపెడితేనో, ఎవరో దయదలచి ఇస్తే తెలంగాణ రాలేదు. కేసీఆర్ త్యాగం, కృషి, పోరాటపటిమ వల్ల తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కటిక చీకటి వస్తుంది, నక్సలైట్ల రాజ్యం వస్తుంది అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల తెలంగాణను తయారు చేసుకున్నాం. కోటి ఎకరాల మాగాణను తయారు చేసుకున్నాం. సాగు నీళ్ల పన్ను మాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారు. చివరి గింజ వరకు వడ్లు కొని కేసీఆర్ చరిత్ర సృష్టించార‌ని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

Brs Mlc Kavitha Sensational Comments On Congress Leaders
Brs Mlc Kavitha Sensational Comments On Congress Leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *