Warangalvoice

Brs Mlc Kavitha Sensational Comments On Bc Reservations

MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

  • MLC Kavitha | బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ క‌విత‌ ఎండగ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ క‌విత‌ ఎండగ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు.

కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని క‌విత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు. వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది కానీ ఆ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదు? అని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌శ్నించారు.

బీసీ వర్గీకరణ కోసం మోదీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు..? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసలు ఈ 42 శాతం అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలి. ఏ కారణం చేత 42 శాతమని నిర్ణయానికి వచ్చారు ఎందుకు చెప్పడం లేదు..? అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసి తమ పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషనన్‌ను నియమించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు..? నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి అని క‌విత డిమాండ్ చేశారు.

కులాల వారీగా, గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు..? బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుంది. బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు..? ఏ గ్రూపుకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవు. న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోవద్దన్నది తమ అభిప్రాయం.
చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉంది. బీసీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వ రూపొందించాలి. బీసీలకు ఏటా రూ 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం 9200 కోట్లను మాత్రమే ప్ర‌భుత్వం కేటాయించింద‌ని గుర్తు చేశారు.

ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేది.
మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరం. బిసి, ఎస్సీ, ఎస్టి, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఎంతోమంది పోరాట వీరులు, త్యాగధ‌నులు ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందాల్సిన అవకాశాలు ఇంకా అందలేదు. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23 శాతం ఎప్పుడు భర్తీ కాలేదు. యూపీఎస్సీలో 27 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలు కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలో 50 శాతం జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15 శాతం మాత్రమే సంపద ఉంది… ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉంది అని క‌విత అన్నారు.

భిన్న వృత్తుల సమూహారమైన బీసీ వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. కుల వృత్తుల వారు సంప్రదాయ ఆదాయ వనరులను కోల్పోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి కృషి చేయకపోవడం బాధాకరం. బీసీలకు, మహిళలకు రాజ్యాంగ రక్షణ లేకపోవడం వల్ల విస్మరణకు గురవుతున్నారు. ఆర్థిక స్వతంత్రం, అధికారం, ఆత్మగౌరవం కోసం బీసీలంతా పోరాటం చేస్తున్నారు. అనేక బీసీ కులాలు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తుండడం ఆందోళనకరం. సంచార జాతుల వారి పిల్లలకు విద్య విషయంలో ఎంతో ఆవేదన కలుగుతుంది. కేసీఆర్ సంచార జాతుల వారి కోసం రెసిడెన్షియల్ స్కూల్ లలో ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోవడం దారుణం అని ఎమ్మెల్సీ క‌విత మండిప‌డ్డారు.

Brs Mlc Kavitha Sensational Comments On Bc Reservations
Brs Mlc Kavitha Sensational Comments On Bc ReservationsBrs Mlc Kavitha Sensational Comments On Bc Reservations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *