Warangalvoice

Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

MLC Kavitha | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల వ‌ల్ల 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు న‌ష్టం : ఎమ్మెల్సీ క‌విత‌

  • MLC Kavitha | కొడంగ‌ల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : కొడంగ‌ల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు బీమా నుంచి కాకుండా జూరాల నుంచి నీటిని తీసుకుంటే మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారని తెలిపారు. నాగ‌ర్‌క‌ర్నూల్‌లో ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు.

8 మంది ప్రాణాలు ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే… కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారు. ఒక్క మంత్రి కూడా ఘటనా స్థలం వద్ద ఇప్పుడు లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదనేది అర్థ‌మ‌వుతుంది. కేసీఆర్ హాయాంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను 11.5 కి.మీ. త‌వ్వినప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నదాన్ని బట్టి అర్థమవుతోంది. మట్టి, రాళ్లు పడుతున్నాయని కార్మికులు చెబుతున్నా ఏం కాదని చెప్పి పని చేయించారని క‌విత పేర్కొన్నారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌ది. పాలమూరు ‌- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కేసీఆర్ హాయాంలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం నార్లాపూర్ వద్ద పంప్ హౌజ్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా నీళ్లు ఇవ్వాలనుకుంటే 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉందని క‌విత తెలిపారు.

గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సక్రమంగా, సకాలంలో రైతులకు యూరియా లభించేది. కానీ ఇప్పుడు ఎందుకు రైతులకు యూరియా అందుబాటులో లేదు..? కేంద్రంతో కొట్లాడి కేసీఆర్ రాష్ట్రానికి ఎంత మేర యూరియా అవసరం అవుతుందో ముందే తెప్పించేవారని క‌విత గుర్తు చేశారు.

త‌క్షణమే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు నెలకు రూ. 2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో కనీసం సరైన భోజనం పెట్టడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బిడ్డలు చనిపోవడం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫీజు రియింబర్స్‌మెంట్ జరగక చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మెఘా కృష్ణా రెడ్డి వంటి వాళ్లకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం… ప్రజలను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాళ్లవైపే చూస్తుంది.. ప్రజల వైపు కాదు. కుల సర్వేకు సంబంధించి గ్రామాల వారీగా కులాల జనాభాను బహిర్గతం చేయాలి అని క‌విత డిమాండ్ చేశారు.

Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics
Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *