- ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ
- ఉలుకూ..పలుకూ లేని ప్రభుత్వం
- ఏడాదైనా కనికరించని కాంగ్రెస్ అధిష్ఠానం
- కొత్త ఏడాదిలోనూ తప్పని ఎదురు చూపులు
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది. కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. డిసెంబర్ చివరిలోగా విస్తరణ జరుగుతుందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. అయితే విస్తరణకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లటం, ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి పనికి ఢిల్లీ అధిష్ఠానంపై ఆధారపడటాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక అవసరాల దృష్ట్యా ఇక్కడే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలంటున్నారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు మరో ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. అయితే మంత్రి వర్గ విస్తరణ రేపు మాపు ఉంటుందంటూ ఏడాదికాలం గడిపారు తప్ప ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్ని చక్కర్లు కొట్టినా మోక్షం కలగడం లేదు. ఆయన అభ్యర్థనలను అధినేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలు రావడం..టీవీ సీరియల్‌ను తలపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకోవడం గమనార్హం.
పెరుగుతున్న పోటీ..
మంత్రి పదవిని ఆశిస్తున్న వారంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిగా ఇదే విషయమై ఢిల్లీ దాకా పైరవీలు చేస్తున్నారు. రోజుకొకరు తెర విూదికి వచ్చి మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఆశించడం తప్పేం కాదన్నట్లుగా ఏఐసీసీ దాకా మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో మొదటి జాబితాలోనే పేరున్న వారిలో ఈ కొత్త పరిణామాలు ఒకింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి.
కులాల ప్రాతిపదికన..
చూస్తుండగానే ఏడాది కాలం కరిగి పోయింది. ప్రభుత్వం వస్తే పదవి గ్యారంటీ అని కొందరు మొదట్నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతోంది. ఏకంగా దళిత సామాజిక వర్గం కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం చేస్తుండగా మరొకరు తమ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారు మంత్రి పదవి కోసం పోటీ పడడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 2024 సంక్రాంతి నుంచి మొదలైన ఈ పోటీ 2025 సంక్రాంతి వస్తున్నా ముగింపు కార్డు మాత్రం పడలేదు. అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలింది.
ఆశావహులు వీరే..
మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. ఇందులో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో సామాజిక సమతుల్యత పాటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దానిని అధిగమించేందుకు నాయకులు పలు మార్లు మేధోమథనం జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమిర్ అలీఖాన్, కోదండ రాం తదితరులు పోటీ పడుతున్నారు. ఖాళీ ఉన్న ఆరింటిని భర్తీ చేసినా కూడా మంత్రి పదవులు రాకుండా మిగిలే వారెక్కువ ఉన్నారు. మంత్రి మండలిలో అవకాశం దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసి అభివృద్ధి ఆథారిటీ ఛైర్మన్ వంటి నామినేటెడ్ పదవులను ఇచ్చి సంతృప్తి పరచాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం మాత్రం ఎప్పుడన్నది తేలడం లేదు.