- Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే పనులు చేయాల్సిన కార్యక్రమాల గురించి అరగంటకు పైగా తమతో చర్చించి సానుకూలంగా స్పందించారని అన్నారు. వరంగల్‌కు సంబంధించి తాము అడిగిన సమస్యలతో పాటు వరంగల్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామని అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఈ సందర్భగా అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్ వేరుగా ఏర్పాటు చేయాలని కోరామన్నారు. డోర్నకల్ భద్రాచలం రైల్వే లైన్ ఉంది కానీ బ్రిడ్జి పూర్తి కాలేదని.. దానిపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడి సమస్యలపై వినతి పత్రాలు అందజేశామని మంత్రి కొండా సురేఖ గుర్తుచేశారు.
ఏపీలో ఐదు డివిజన్లు ఉన్నాయని… హైదరాబాద్ తర్వాత పెద్ద మహా నగరం వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ వచ్చిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌ను ఎవరో వచ్చి తామిచ్చామని చెప్పుకుంటే పర్వాలేదన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలతో కోటలు కట్టింది కానీ ఏం చేయలేదని మండిపడ్డారు. వరంగల్‌కు ఇండస్ట్రీస్ రాలేదు రావాల్సినటువంటి ఎయిర్‌పోర్ట్ ఎప్పుడో రావాల్సి ఉన్నా ఇంకా రాలేదని చెప్పారు. తమ అందరి కృషితో రైల్వే లైన్ల విస్తరణ ఏర్పాట్లు సాధించుకుందామని అన్నారు. చాలా కాలంగా ప్రజలకు ఉపయోగపడే పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అన్నింటిని అభివృద్ధి చేసుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌తో సహా తదితర అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజ్ఞప్తి చేశామన్నారు. వాటన్నిటిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
బీజేపీలో గెలిచిన కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రం గురించి ఏం పట్టనట్టుగా ఉండటం బాధాకరమని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఇకనుంచి అయినా పార్టీలను పక్కనపెట్టి అందరం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి పనులకు బీజేపీ నేతలు సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్‌ను అతిపెద్ద రెండో రాజధానిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయాలనుకుంటున్నారని అన్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ కలసాకారం అవుతున్న వేల దానికి అనుగుణంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరామని అన్నారు. వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే సదుపాయాన్ని ఇవ్వడంతో పాటు చింతనపల్లిలో ఉన్న కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు కావలసిన విధంగా రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరామని చెప్పారు. వెంటనే స్పందించిన అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఆ రైల్వే లైన్ మంజూరు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పాండురంగాపురం – మల్కాన్ గిరి రైల్వే లైన్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పాండురంగాపురం – మల్కాన్ గిరి రైల్వే లైన్‌ను సారపాక (భద్రాచలం)వరకు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని లేఖ ద్వారా మంత్రి తుమ్మల కోరారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు,పెనుబల్లి నుంచి కొండపల్లి వరకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని లేఖలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు.
