- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులపై నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ వాయిస్, నల్లగొండ విద్యా విభాగం (రామగిరి) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులపై నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక వద్ద విద్యార్థులు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సవం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. విద్యార్థుల హక్కులను, భూమిని కాపాడేందుకు తమ పోరాటం విజయవంతమైందని, ప్రభుత్వ అన్యాయ విధానాలను ఎదుర్కొనేందుకు ఇంకా గట్టిగా నిలబడాలని విద్యార్థులను కోరారు.
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఏకమవుతామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థి హక్కులను దెబ్బతీసే ఏ నిర్ణయాన్ని తాము ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ ఎంజీయూ నాయకులు మాచర్ల సుధీర్, మహేశ్, పత్తిపాటి వంశీ, ఝాన్సీ, అరుణ, అలేఖ్య, పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
