- Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ 69 లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తంగా 37 రోజుల్లో 55.31 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. కాగా, వారాంతం తర్వాత రద్దీ తగ్గుతుందని అంతా భావించారు.. అయితే, సోమవారం ఒక్కరోజే ఏకంగా కోటి మందికి పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. దీంతో సోమవారం రాత్రి మహా కుంభ్ సమీప ప్రాంతాలైన నైని నయా వంతెన, ఫాఫమౌలో 10-12 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా 8 నుంచి 10 కి.మీ దూరానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం కూడా కుంభ్‌మేళాలో రద్దీ కొనసాగింది. సంగం వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ఇప్పటి వరకూ 55 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఈ మహాకుంభమేళాను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
