Warangalvoice

Laxman: Society is bowing its head after seeing Revanth Reddy

Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది

  • Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.

వరంగల్ వాయిస్, సిద్దిపేట : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేటలో లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మోదీ ఒక వర్గానికి, సమాజానికి చెందిన వారు కాదు.. ప్రజలందరి మనిషి. ప్రపంచ ఖ్యాతి కలిగిన వ్యక్తి అని తెలిపారు. మోదీపై గతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇలాగే అవాకులు, చెవాకులు పేలారని అన్నారు. రాహుల్‌కు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయమని హెచ్చరించారు. మోదీని విమర్శిస్తే, పేరు వస్తుందని రేవంత్ అనుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన తప్పుల తడకగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమంటే మైనార్టీలతో కూడిన బీసీ కులజాబితా అని చెప్పారు. ముస్లింలను బీసీలో చేర్చి.. ఓట్ల కోసం రేవంత్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. మత ప్రాతపదికన రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని చెప్పారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు నిరాశతో ఉన్నారని చెప్పారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్‌గా భావించి రేవంత్ ప్రభుత్వానికి కళ్లెం వేయాలని అన్నారు. మేధావులు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. రేవంత్ రెడ్డిను చూసి సమాజం తల దించుకుంటుందని విమర్శించారు. T20 మ్యాచ్ ఆడిన కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. 15 ఏళ్లల్లో ఢిల్లీలో మూడుసార్లు రాహుల్ డకౌట్ అయ్యారని విమర్శించారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ వేల కోట్ల నిధులు ఇస్తున్నా.. ఇన్ని విమర్శలు చేస్తారా అని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Laxman: Society is bowing its head after seeing Revanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *