- KTR | రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో పేదల ఇండ్లపై పగబట్టిందని విరుచుకుపడ్డారు కేటీఆర్.
ఫార్మాసిటీ పేరుతో భూముల చెర.. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబ రియల్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమించుకుంటుందన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ.. పెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. నాడు మద్యం వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి.. నేడు మద్యం ముద్దు అంటున్నారని పేర్కొన్నారు. ధరల సవరణ పేరుతో, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి.. వాటిపై ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని తెలిపారు. రైతుభరోసా రాదు.. రుణమాఫీ కాదు.. పంటలు కొనుగోలు చేయరు.. రూ.500 క్వింటాలు ధాన్యానికి బోనస్ బోగస్ అయింది.. తులం బంగారం ఇయ్యరు.. ఉద్యోగాలు వేయరు.. ఉద్యోగులకు పీఆర్సీ రాదు, డీఏలు ఇవ్వరు అని కేటీఆర్ మండిపడ్డారు.
సత్యం వధ.. ధర్మం చెర బట్టిందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధం పాతాళానికి తీసుకెళ్లారు. ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారు. ఇది పాలన కాదు పీడన.. ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
