- KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ (Former Minister KTR) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే టీఆర్‌ఎస్ ప్రతిపాదించిందని.. 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో టీఆర్‌ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని… ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు.
రేవంత్ రెడ్డిది ఢిల్లీలో ఏమీ నడుస్తలేదన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గుజరాత్‌లో రేవంత్‌ను ఉద్దేశించి తమ పార్టీలో బీజేపీకి కోవర్టులు ఉన్నారని అన్నారన్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని.. ఆయన స్థానంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని విమర్శించారు. ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ లేదన్నారు. రేవంత్ రెడ్డికి అంత ఉంటే ముందు కేబినెట్ విస్తరణ చేసేవారన్నారు. 39 సార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడం దిగడం తప్ప చేసింది ఏం లేదని విమర్శలు గుప్పించారు.
భారీ కుంభకోణం…
రేవంత్ రెడ్డి చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని కామెంట్స్ చేశారు. వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ కుంభ కోణానికి తెర లేపబోతున్నారని.. వెంటనే దీనిమీద శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1947 నుంచి దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఎం ఇంత స్థాయిలో డబ్బులు సంపాదించడం తెలియదేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాళాకోరుతనం బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ వస్తారు…
ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని అన్నారు. గవర్నర్ అడ్రెస్ కార్యక్రమంలో కూడా అటెండ్ అవుతారని తెలిపారు. రేవంత్ స్థాయికి తాము చాలన్నారు. ‘ఒక లీడర్‌గా , మాజీ మంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా.. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఈ చిల్లర గాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఆయన వ్యక్తిగతం’ అని చెప్పుకొచ్చారు.
త్వరలో ఉపఎన్నికలు..
త్వరలో తెలంగాణాలో పది ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. తమకు ఈ మేరకు సమాచారం ఉందన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఆర్‌ఆర్‌టాక్స్ నడుస్తోందన్న మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిమీద మోడీకి ఎందుకు అంత ప్రేమ అని నిలదీశారు. కిషన్ రెడ్డి నిస్సహాయుడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తమ పార్టీ పునరాలోచనలో పడిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
