వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింది. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు రవాణా చార్యులు భారీగా పెరుగుతాయి. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. పార్లమెంట్లో చర్చ పెట్టమని డిమాండ్ చేసినా పెట్టడం లేదు. అమెరికా పన్ను వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుంది. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులు అయ్యే ఫార్మా, ఐటి ఎగుమతులపైన అమెరికా విధించిన పన్నుల వల్ల తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూర్చబోతున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాల వలన జీఎస్టీ పెరుగుదల జీరో శాతంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయడం రావడం లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాలలో ఆదాయం పెంచడంలో విఫలమైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఉన్నది నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్. ఒకటి రెండు రోజుల్లో 400 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారో క్లియర్‌గా చెప్తాను అని కేటీఆర్ తెలిపారు.
