
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని అడిగిన ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియదు. ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరస్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్యమం చేశారు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు..
ఉద్యమంలో ఉద్యోగులు కదం తొక్కి రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉండాలని చెప్పి కేసీఆర్ 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఉద్యోగులే ఉద్యమకారులై కదం తొక్కారు కాబట్టి. పెన్ డౌన్ చేశారు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ కోసం కొట్లాడారు. కానీ ఇవాళ వారిని అవమానించారు. రాష్ట్ర ప్రజలతో వారికి చిచ్చు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి.. కానీ మేం ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూశాం. ఉద్యోగ సంఘాల నాయకులకు కీలక పదవులు ఇచ్చాం. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అలా కేసీఆర్ ఉద్యోగులను గౌరవించారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
మీరు చెప్పిన దాన్నే ఉద్యోగులు అడుగుతున్నరు..
ఇవాళ మీరు మేనిఫెస్టోలో చెప్పిన దాన్నే ఉద్యోగులు అడుగుతున్నరు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు తక్షణమే ఇస్తాం. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం. 317 రద్దు చేస్తాం. కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ ఉద్యోగుల మీరు చెప్పిందే అడుగుతున్నరు.. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పీఆర్పీ, డీఏలు ఏవి అని అడగుతున్నారు. కానీ మీరు ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
