- KTR | చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేకపోవడం హైదరాబాద్ సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన మల్లెల శ్రీవిద్య అడ్మిషన్‌ను స్కూల్ యాజమాన్యం రద్దు చేసింది. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్య గురించి పత్రికలో వచ్చిన వార్తకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామన్నారు. ఇంతేకాదు శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల స్కూల్ ఫీజును చెల్లించారు. భవిష్యత్తులో శ్రీ విద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పారు. కేటీఆర్ చొరవతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
తమ సమస్య గురించి తెలుసుకుని శ్రీవిద్య జీవితానికి కొత్త వెలుగు అందించిన కేటీఆర్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికలో వార్త వచ్చిన తరువాత అధికారులు నామమాత్రంగానే స్పందించారని చెప్పారు. రెండు సంవత్సరాల ఫీజు ముందే కట్టడంతో పాటు భవిష్యత్తులోనే శ్రీవిద్య చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానన్న కేటీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
