- KTR: గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో ప్రసంగించారు. అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌ను కూడా అవమానించింది, మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసాపై గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారని అన్నారు. తెలంగాణలోని ఒక్క గ్రామంలో కూడా వందశాతం రుణమాఫీ కాలేదని ధ్వజమెత్తారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌తో చర్చకు రెడీ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
తేదీ, సమయం, ఊరు.. చెబితే చర్చకు వస్తానని కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. బీసీల తరపున మాట్లాడిన సొంత ఎమ్మెల్సీని కాంగ్రెస్ సస్పెండ్ చేసిందన్నారు. కులగణనతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపుతామని చెప్పారు. కేసీఆర్‌పై కోపంతో రైతులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చేతకానితనంతో.. పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి 20శాతం కమీషన్లు ఇవ్వకుంటే బిల్లులు పాస్ అవ్వవని ఆరోపించారు. బిల్లుల కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు బైఠాయించటం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. 30శాతం కమీషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని విమర్శించారు. దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన సోదరుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
