- KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచక కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తల్లు దుంకాయని కేటీఆర్ గుర్తు చేశారు. నేడు అదే చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని మండిపడ్డారు. నాడు కాలువల నిండా నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు కేసీఆర్ అండగా నిలిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పడావుబెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను ఎండబెడుతుందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషంగా ఉన్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రాదు, సాగునీళ్లు ఇవ్వరు, కరంటు ఇవ్వరు, విత్తనాలు దొరకవు, ఎరువులు ఉండవు, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయ అనుకూల విధానాలతో పండగలా వ్యవసాయం ఉండే అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతపై కక్షగట్టి వ్యవసాయాన్ని ఆగంపట్టించారని మండిపడ్డారు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అశ్వారావుపేట నుండి జహీరాబాద్ వరకు వ్యవసాయం తిరోగమనంలో ఉందన్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్.. రైతుల గుండెలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువును తెచ్చింది. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ! అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
