- KTR | తొండ ముదిరితే ఊసరవెల్లి అయితదని పెద్దలు చెబుతుంటారు.. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తొండ ముదిరితే ఊసరవెల్లి అయితదని పెద్దలు చెబుతుంటారు.. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్‌లా ఉంది. నీ తెలివి తక్కువ తనం వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం తగ్గిపోయింది. మీడియా ముందు రంకెలు వేయడం కాదు.. అంకెలు ఎందుకు ఆగమాయ్యాయో చెప్పు. గత బడ్జెట్ సందర్భంగా చెప్పినట్లు మీ బడ్జెట్ అంచనాలకు ఎందుకు చేరుకోలేకపోయింది. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. పదేండ్ల ప్రగతి రథచక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, చేతగానితనానికి నిలువుటద్దం ఈ బడ్జెట్. వీరి అసమర్థతత, చేతకాని తనం వల్ల ఆకాశం నుంచి పాతాళం వైపు ఆర్థిక వ్యవస్థ పోతున్నదంటే కచ్చితంగా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కేసీఆర్ ఏడాదికి రూ. 40 వేల కోట్ల అప్పు జేస్తే రంకెలు వేశారు. కానీ ఇవాళ ఒక్క ఏడాదికి లక్షా 60 వేల కోట్లు అప్పు చేసి కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే లక్షల కోట్ల అప్పు టార్గెట్ కనబడుతున్నట్టు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
తొండ ముదిరితే ఊరసవెల్లి అవుతదని పెద్దలు చెబుతారు. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈబడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సంక్షేమానికి సమాధి.. అభివృద్ధికి అడ్రస్ గల్లంతు.. ప్రజలకు ఇచ్చిన హామీలకు ఘోరీ కట్టి.. పార్టీ కార్యకర్తలకు మాత్రం వీళ్ల అబ్బ సొత్తు.. పప్పుబెల్లం లాగా 6 వేల కోట్లు పంచి పెడుతారట. కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. పప్పుబెల్లంలాగా పంచి పెడుతామంటే.. అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అయితది అని కేటీఆర్ మండిపడ్డారు.
