- KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బడుగు, బలహీన వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఆరు గ్యారెంటీల ఊసే లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ రోజు రాష్ట్రంలోని పేదలు, రైతులు, ఆడబిడ్డలు అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే భట్టి విక్రమార్క సుదీర్ఘ ఉపన్యాసం విన్న తర్వాత మాకు అర్థమైందంటే ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. ఆరు గ్యారెంటీలకు తిలోదకాలు వేశారు, పాతరేశారని స్పష్టంగా అర్థమైంది. ఇది కాంగ్రెస్‌కు రెండో బడ్జెట్. ఈ బడ్జెట్‌ను చూసిన తర్వాత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 2500 నూరు రోజుల్లో ఇస్తామని ఓట్లు వేయించుకుని గెలిచి.. ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. మహిళలు నిరాశలో ఉన్నారు. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి పెద్ద మనషులు మోసం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్‌లో 420 హామీలు గురించి కూడా ప్రస్తావించలేదు. ఆరు గ్యారెంటీలు, నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి.. ఇవి భగవద్గీతతో సమానం అని అబద్దాలతో ఓట్లు వేయించుకుని వాటికి ఇవాళ పాతరేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. తులం బంగారం దిక్కు లేదు.. మహాలక్ష్మికి దిక్కు లేదు. పెన్షన్లకు పాతరేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ రూ. 1200 కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ రూ. 370 కోట్లకే పరిమితమైపోయింది. ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్హత్య చేసుకున్నారు. వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అతిగతి లేదు. వారి గురించి ఒక్క మాట లేదు. స్విగ్గీ, జొమాటో, ఇతర యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్‌కు గిగ్ వర్కర్స్ బోర్డు పెడుతామని చెప్పి మోసం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసి 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. వారికి ఇంకా ఎక్కువ మేలు, న్యాయం చేస్తామన్నారు. వారి గురించి ఒక్క మాట కూడా బడ్జెట్‌లో చెప్పలేదు. పీఆర్సీ, డీఏల గురించి స్రస్తావించలేదు. ఆడబిడ్డలకు తీరని తీవ్రమైన అన్యాయం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేశారు. యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తామని నమ్మబలికి వారి ప్రస్తావనే లేదు. ఆ పథకం ఊసే లేదు. అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు.. కానీ దళితులకు వెన్నుపోటు పొడిచారు. కనీసం మాట కూడా స్రస్తావించలేదు. దళిత, గిరిజన సోదరులను మోసం చేశారు.
అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు. ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే.. కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తున్నా.. దరమ్ముంటే రా రాహుల్ గాంధీ.. అశోక్ నగర్‌కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, యువ వికాసం అన్నారు. వీటి గురించి ఒక్క మాట లేదు. విద్యాభరోసా కార్డు గురించి ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థలు వీరు.. 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే నివారించలేని వారు.. కొత్త స్కూల్స్ కడుతామని బిల్డప్స్ ఇస్తున్నారు.. సిగ్గు పడాలని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
