- KTR | ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లను చంచల్‌గూడ జైల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, డా. దాసోజు శ్రవణ్ తదితర బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని అపోహ పడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా భావిస్తున్నారు. ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. 420 హామీలను ఇచ్చి తమని మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ప్రజలు తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
బజారు భాషలోనే మాట్లాడితే బాగుంటుందని..
ముఖ్యమంత్రికి అర్థం కావడానికి ఆయన మాట్లాడే బజారు భాషలోనే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది సామాన్యులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్‌కి దుకాన్ ఇదేనా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనం నిలదీస్తే.. ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కు పాదం మోపుతారా? జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరిద్దరు జర్నలిస్టులను కాదు పదుల సంఖ్యలో జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులతో వేధిస్తుంది. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే యూట్యూబ్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు..
6 గ్యారంటీలతోపాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. తన భార్యా పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న రేవంత్ రెడ్డి గతంలో మా మీద అవాకులు చెవాకులు మాట్లాడిన సంగతి మర్చిపోయారా? మా పిల్లల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్‌కు కుటుంబం గుర్తుకు రాలేదా? నువ్వు మాట్లాడితే మంచిది ఇంకొకరుమాట్లాడితే మంచిది కాదా..? రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. సిగ్గు తెచ్చుకోవాలి అని కేటీఆర్ సూచించారు.
రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే శాస్తి జరుగుతుంది..
బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇవాళ రేవతి, తన్వి యాదవ్‌లను కలిసి వారికి ధైర్యం చెప్పాం. వారి తరపున న్యాయపోరాటం చేస్తాం. జైల్లో పెడతామంటే భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు. మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. జనం నుంచి వచ్చినవాళ్లం. కేసులకి బెదిరింపులకి భయపడే వాళ్ళంకాదు. రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే శాస్తి జరుగుతుంది. ఆయనకు వంతపడే వాళ్లకు కూడా జరుగుతుంది. రేవతి, తన్వియాదవ్‌లకు జరిగిందే రేపు మిగితా జర్నలిస్టులకు కూడా జరగవచ్చు. ప్రజల ఆక్రోశాన్ని చూపించడమే వారు చేసిన తప్పా? అని కేటీఆర్ నిలదీశారు.
తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఈజ్ ఫాలింగ్..
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. రూ. 71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని నిన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ అసమర్థ విధానాల వల్లనే ఆదాయం తగ్గింది. తాము వచ్చాక తెలంగాణలో అన్ని రంగాలు చాలా బాగున్నాయి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి 71 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గిందో చెప్పాలి. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని నిన్ననే ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేశారు. పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో రాయిల తెలంగాణ మారింది. జర్నలిస్టులను జైల్లో పెడతామని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుంది. దయచేసి మీడియా గొంతు విప్పి రేవంత్ రెడ్డి అక్రమాలపై మాట్లాడాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
